రాజన్నసిరిసిల్ల జిల్లా డిసెంబర్ 25 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో… భక్తులు భయాందోళనకు గురయ్యారు.పుణ్యక్షేత్రంలో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ, కంటబడిన వారందరిపై దాడికి తెగబడింది.ఈ ఘటనలో స్వామివారి దర్శనానికి వచ్చిన సుమారు 21 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.రాజన్న దర్శనం కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు జాతర గ్రౌండ్ సమీపంలో ఉండగా, ఒక్కసారిగా పిచ్చికుక్క వారిపై దాడి చేసింది.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వెంటాడి మరీ కరవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జాతర గ్రౌండ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధి కుక్కలు, పిచ్చికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









