గంగాధర ఫిబ్రవరి 17 (నవ వెలుగు) : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సేన కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కల నాటకం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఠాగూర్, మండల నాయకులు నవీన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్రంలో హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా పచ్చని తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









