చొప్పదండి ఫిబ్రవరి 25 (నవ వెలుగు) : చొప్పదండి నియోజకవర్గంలోని రైతుల యేసంగి పంటలు ఎండిపోకుండా చివరి మడి వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. బుధవారం సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన గాయత్రి పంపు హౌస్ నుంచి వరద కాలువకు తక్షణం నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.అధికారులతో చర్చించిన అనంతరం రెండు రోజుల్లోనే వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యేసంగి సీజన్‌లో పంటలు ఎండిపోకుండా కాపాడడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గుంటకు సాగునీరు అందించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గాన్ని “వాటర్ హబ్”గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కాలువల మరమ్మతులు, పంప్ హౌస్‌ల సామర్థ్య పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేస్తామని వివరించారు.రైతులు ధైర్యంగా పంటలు సాగు చేయాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు.









