గంగాధర మార్చి 26 (నవ వెలుగు) : చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే వివిధ ప్రాంతాలలో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చిన ఆయన, ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, రోడ్లు మరియు ముంపు సమస్యలపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొన్నదని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొండగట్టు ప్రాంతంతో పాటు సమీపంలోని జేఎన్టీయూ కళాశాల మరియు పలు గ్రామాలకు త్రాగునీటి సమస్య తీరుతుందని పేర్కొన్నారు.
అలాగే నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని నింపిన తరువాత కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు పాములు, తేళ్లు మరియు ఇతర విష కీటకాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కట్ట ఎత్తు పెంపుతో పాటు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి బాధితులకు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా నారాయణపూర్ కుడి కాలువ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. ఇక రామడుగు మండలంలోని మోతే రంగసాయిపల్లి, రుద్రారం గ్రామాలలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొత్తంగా చొప్పదండి మరియు పరిసర నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు.









