గంగాధర మార్చి 28 (నవ వెలుగు) : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ దశ “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గంగాధర లయన్స్ క్లబ్ సహకారంతో గ్రామంలోని వి ఏ ఎస్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ చూపడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని ఆయన తెలిపారు. ఈ శిబిరానికి ప్రాంతీయ వాహన డ్రైవర్ల నుండి విశేష స్పందన లభించింది. ఆటో, లారీ, కార్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ప్రతి ఒక్కరికీ సమగ్రంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన సూచనలు అందించారు.వైద్యులు, అధికారులు మాట్లాడుతూ కంటి చూపు స్పష్టంగా ఉండటం డ్రైవింగ్‌లో అత్యంత కీలకమని, సమయానుకూలంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎసిపి విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రజిని, ఎంపీడీవో ధమ్మని రాము, తహశీల్దార్ అంబటి రజిత, సర్కిల్ ఎస్‌ఐలు వంశీకృష్ణ, రాజు, నరేష్ రెడ్డి, గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









