గంగాధర మార్చి 30 (నవ వెలుగు) : చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల పరిధిలో ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలంలోని ఉప్పర మల్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో నీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితిని దగ్గరగా తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల పరిసర గ్రామాల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరువుకు అతి సమీపంలో ఉన్న పొలాలకు కూడా నీరు అందక పంటలు ఎండిపోవడం బాధాకరమని తెలిపారు. ఉప్పర మల్యాల, వెంకంపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంటలను పరిశీలించిన ఆయన నీటి లభ్యత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కుడి కాలువ నిర్మాణం ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు కుడి కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30,000ల చొప్పున నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ కొప్పుల వెంకటేష్‌తో పాటు గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు పలుమారి సతీష్, యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగరాజు, గుండవేణి నరేష్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.









