గంగాధర జూలై 12 : గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని,కాంగ్రెస్ పాలనలో పల్లెలన్ని సమస్యలతో సతమతమవుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గంగాధర మండలం ముప్పిడి నర్సయ్య గ్రామంలో శనివారం స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలసి శ్రమదానం చేశారు. అనంతరం బూరుగుపల్లి బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు లేక ట్రాక్టర్ల నిర్వహణ నిలిచిపోవడంతో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడ ఉండడంతో క్రిమి కీటకాలు వృద్ధి చెంది గ్రామాల్లోని ప్రజలు వ్యాధులు పడే అవకాశం ఎంతైన ఉన్నదని, ఇంటింటి చెత్త సేకరణ
ఇబ్బందుల వల్ల పల్లె జనం ఎక్కడ వ్యాధులకు గురవుతామోనని భయభ్రాంతులకు గురవుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారిందని అన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని, పూర్తిభారం పంచాయతీ కార్యదర్శులపైనే పడిందని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాకపోవడంతో కార్యదర్శులు సమస్యలను పరిష్కరించలేక పోతున్నారని వాపోయారు. ఇంటింటి చెత్త సేకరణ సైతం లేకపోవడంతో పల్లె జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నన్నారు.పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసిందని,గ్రామ జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్‌తోపాటు ట్రక్కు, ట్యాంకర్‌ను సైతం అందించామని, పచ్చదనం-పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలిందని,గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీలకు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని అన్నారు. ఇంతకాలం నెట్టుకొచ్చిన కార్యదర్శులు సైతం చేతులెత్తేయడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గ్రామాల్లో చెత్త సేకరణ కూడా చేయించ లేకపోవడంతో చొప్పదండి మాజీ సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.మరమ్మతులు చేయించలేక
నియోజకవర్గంలో అన్నిచోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేశామన్నారు. వాటికి సంబంధించి కిస్తీలు ప్రతినెలా రూ.6 నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదినర్థంగా పెండింగ్‌లో ఉన్నాయని, ట్రాక్టర్లు తీసుకొని ఐదేండ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయనీ వాటిని బాగు చేయించాలంటే రూ.20 వేల రూ.30 వేల వరకు ఖర్చవుతుండడంతో పంచాయతీలకు భారంగా మారిందన్నారు. కనీసం డీజిల్ కూడా డబ్బులు లేక కొన్ని పంచాయతీల్లో వారానికి, పది రోజులకు చెత్త సేకరిస్తుండగా మరికొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లను మూలనపెట్టారన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో పల్లెప్రగతి ద్వారా 20 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల్లో పూడికతీతలు, పిచ్చిమొక్కలు తొలగించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా పల్లెప్రగతిని పట్టించుకోకపోవడంతో పల్లెపాలన అస్తవ్యస్తమైందని, ప్రకృతి వనాలు, హరితహారంలో నాటిన మొక్కలు సైతం నీరు లేక మోడుబారిపోయాయన్నారు. వర్షాకాలం వచ్చినప్పటికీ అధికారులు పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతో డ్రైనేజీల్లో మురుగునీరు పారుతూ ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీజనల్ వ్యాధులు ప్రబలుతాయేమోనని భయపడుతున్నారు. రోజుల తరబడి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిచడం, పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారిపోయాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్యం సమస్యను పరిష్కరించాలని, పల్లెప్రగతి పనుల ద్వారా పనులు చేపట్టి పల్లెలను బాగు చేయాలని కోరుతున్నానని అన్నారు.ఏడాదికిపైగా అందని బిల్లులు
సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాత బిల్లులు అందక కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,
ఒకపక్క బోరు మోటార్లు బాగు చేయించడం, పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులను చేస్తే ఎఫ్‌డీఎఫ్ నిధులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు చేయించిన వాటికి ఏడాదికాలంగా కార్యదర్శులు ఎదురుచూస్తున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర మాని పల్లెలపై కన్నెత్తి చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









