మల్యాల : మల్యాల మండలంలోని రాంపూర్ పంప్ హౌస్ ద్వారా శనివారం వరద కాలువలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పంప్ హౌస్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి ప్రవాహానికి పూలు, పసుపు, కుంకుమలు సమర్పించి, మంగళ హారతులు ఇచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులతో నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి వల్ల సమయానికి నీటి విడుదల జరిగిందని, ఇది రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ శ్రేణులు, వివిధ గ్రామాల రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.









