విజయనగరం : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడొక ఆసక్తికరమైన అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ రాజకీయాల్లో అరుదుగా కనిపించే రీతిలో, ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండటం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
జెడ్పీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె సిరిసహస్ర ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఈ రాజకీయ మార్పులో ఒక ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది.
పసుపు కండువా కప్పుకున్న మామా-కూతురు: చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరిసహస్ర టీడీపీ గూటికి చేరారు.
చేరికకు దూరంగా భర్త: సిరిసహస్ర భర్త ప్రదీప్ ఈ పరిణామాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. చిన్న శ్రీను నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఆయన కనిపించలేదు.
వైసీపీలోనే తండ్రీ కొడుకులు: ప్రదీప్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల సమన్వయకర్తగా ఉన్నారు. ప్రదీప్ కూడా వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నారు.
కుటుంబ వ్యూహమేనా?
ఒకవైపు భర్త, ఆయన తండ్రి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతుండగా.. మరోవైపు భార్య, ఆమె తండ్రి టీడీపీ వైపు అడుగులు వేశారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ కుటుంబ రాజకీయ ఉనికి దెబ్బతినకుండా ఉండేందుకే ఈ రకమైన వ్యూహాత్మక అడుగులు వేశారనే విశ్లేషణలు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాబోయే 2029 ఎన్నికల నాటికి ఏ పార్టీ గెలిచినా కుటుంబ పట్టు నిలబెట్టుకునే పక్కా స్కెచ్‌తోనే ఈ సరికొత్త ఫ్యామిలీ పాలిటిక్స్‌కు తెరలేపారని స్థానికంగా చర్చ జరుగుతోంది.









