గంగాధర : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు దాడి చేశారంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ బాధిత రోగుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. పోలీసులు ఆయనను కడుపులో తన్ని, భౌతికంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని సుంకె రవిశంకర్ అన్నారు. పోలీసుల చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వినయ్ భాస్కర్‌పై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులుగా తేలిన పోలీసులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.









