మల్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల భద్రతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఒక శిథిల గది ఉందని, దాన్ని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకుడు పొనగంటి రమేష్ డిమాండ్ చేశారు.గుట్టపై బండ్ల పూజ నిర్వహించే ప్రదేశం పక్కనే ఉన్న ఒక గది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఆ గది ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల పూజల కోసం వచ్చే భక్తుల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఆ గది కూలిపోతే దానికి అత్యంత సమీపంలో ఉన్న కీలకమైన పైప్‌లైన్ కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి, బండ్ల పూజల కోసం ఇక్కడికి వస్తుంటారు. అధికారులు వెంటనే స్పందించి ఈ స్థలాన్ని పరిశీలించాలి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదకరంగా ఉన్న శిథిల గదిని వీలైనంత త్వరగా తొలగించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి" అని ఆలయ అధికారులను కోరారు.









