మల్యాల : ముత్యంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 9వ 'పోషణ్ మా' కార్యక్రమంలో భాగంగా "మన అంగన్వాడీ - మనందరి బాధ్యత" అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి అడేపు భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య పోషకాహారం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు చేర్చుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు. చిన్న పిల్లలకు నిర్ణీత వ్యవధిలో టీకాలు వేయించాలని, శుద్ధి చేసిన మంచి నీటిని మాత్రమే తాగుతూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.తల్లులకు పోషకాహార అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలైన నలుగురు తల్లులకు అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఐదుగురు చిన్నారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆప్యాయంగా అన్నప్రాశన చేయించారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పోషకాహార సూత్రాలు పాటిస్తామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, సిడిపిఓ వీరలక్ష్మి, పోషణ్ అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ మధు, సూపర్ వైజర్ శారద, పంచాయతీ సెక్రటరీ, వార్డు సభ్యులు,ఎఎన్ఎమ్, ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు శోభ,గంగా, శారద,మమత,పద్మ,తల్లులు,గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.









