మల్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనాదేవి సమేత ఆంజనేయస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజున ఆలయ అర్చకులు, వేద పండితులు యాగశాలలో వివిధ వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.ఉదయాన్నే వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అర్చకులు మూలమంత్ర హవనాలు పూర్తి చేసి, స్వామివారికి సమర్పించే పవిత్రలకు జలాధివాస ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.మధ్యాహ్నం పూర్ణాహుతి, అవధారణలు, మంత్రపుష్పం, తీర్థగోష్ఠి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. దేవాలయం పవిత్రోత్సవ శోభతో విరాజిల్లుతుండగా, స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.









