మల్యాల : కొండగట్టు 45వ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.కొండగట్టు దిగువన ఉన్న మెట్ల దారి మార్గంలో రహదారిపై మద్యం సీసాల ముక్కలు పెద్ద సంఖ్యలో పగిలిపడి ఉన్నాయి. పౌర్ణమి సందర్భంగా కాళ్లకు చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు ఈ గాజు ముక్కల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో దారిలో నడుస్తున్న ఇద్దరు భక్తుల కాళ్లకు గాజు ముక్కలు గుచ్చుకోవడంతో చిన్నపాటి గాయాలయ్యాయి.పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో మందుబాబుల వల్ల ఇలాంటి సంఘటనలు జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా జరిగే గిరిప్రదక్షిణ కంటే ఒకరోజు ముందే ప్రదక్షిణ మార్గంలో ఉన్న చెత్తాచెదారాన్ని, పడి ఉన్న బీరు సీసాల ముక్కలను పారిశుధ్య సిబ్బంది ద్వారా శుభ్రం చేయించాలని అంజన్న భక్తులు ఆలయ అధికారులను, స్థానిక యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.









