మల్యాల : ప్రముఖ నటుడు కొణిదల వరుణ్ తేజ్ జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న వరుణ్ తేజ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈఓ అంజనా రెడ్డి వరుణ్ తేజ్‌ను శాలువాతో సత్కరించి, స్వామివారి శేషవస్త్రాలు మరియు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆంజేనేయ స్వామి దీక్ష తీసుకున్న నేపథ్యంలో ఆయన కొండగట్టు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. గతంలో కూడా బాబాయ్ (పవన్ కళ్యాణ్) కొండగట్టు ఆలయ విశిష్టత గురించి చెప్పడంతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు కూడా దీక్షలో భాగంగా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశారు.









