మల్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆరు దశాబ్దాల తర్వాత జరుగుతున్న చందనోత్సవం అనంతరం, స్వామివారి మూలవిరాట్ నిజరూప దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అంజన్న నిజరూపాన్ని దర్శించుకుని తరించారు.
ఆంక్షలతో భక్తులకు తీవ్ర అవస్థలు.
అయితే, కొండపైకి వెళ్లే భక్తుల వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఘాట్ రోడ్డు, జేఎన్టీయూ కళాశాల, దొంగలమర్రి మార్గాల గుండా ఆలయానికి వెళ్లే వాహనాలను బొజ్జపోతన్న గుడి సమీపంలోనే నిలిపివేశారు. ఆలయానికి దాదాపు 1నుండి 1.5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపివేయడంతో, అక్కడి నుండి కాలినడకన వెళ్లడానికి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు చిన్నపిల్లలతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడ్డారు.హనుమాన్ జయంతి ఉత్సవాల సమయంలో కూడా ఇంతటి కఠిన ఆంక్షలు విధించలేదని భక్తులు గుర్తు చేశారు. నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులను ఆలయ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.









