మల్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం కార్తీక పౌర్ణమి, గిరి ప్రదక్షిణ, ప్రభుత్వ సెలవు మరియు స్వామివారి నిజరూప దర్శనం సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. లక్ష మందికి పైగా భక్తులు తరలిరావడంతో రూ.300 ప్రత్యేక దర్శనం క్యూ లైన్ వద్ద ఒత్తిడి పెరిగి బారికేడ్లు పక్కకు పడిపోయాయి.దీంతో టికెట్లు లేని భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భక్తుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా కేవలం ఆలయ ప్రధాన ద్వారాన్ని మాత్రమే సుమారు 10 నిమిషాల పాటు తాత్కాలికంగా మూసివేసినట్లు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.బారికేడ్లను సరిచేసి భక్తులను క్రమబద్ధీకరించిన వెంటనే పది నిమిషాల్లోనే ద్వారాలను తిరిగి తెరిచి దర్శనాలను పునఃప్రారంభించామని తెలిపారు.ఆలయాన్ని పూర్తిగా మూసివేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను, అపోహలను భక్తులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.మీడియా ప్రతినిధులు కూడా వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని, ప్రసారం చేయాలని కోరారు.









