కోరుట్ల మే 30 (నవ వెలుగు) : కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదాల కారణంగా భారీగా దగ్ధమైన ఈత వనాల సమస్యపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్, పెద్దాపూర్, కొనరావు పేట కోరుట్ల మండలం సంగెం,ఐలాపూర్,మాధాపూర్, చిన్నమెట్‌పల్లి, మోహన్‌రావుపేట్, కోరుట్ల పట్టణ పరిధి, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ తదితర గ్రామాల్లో తీవ్ర ఎండల కారణంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో సుమారుగా 18,100 ఈత చెట్లు దగ్ధమయ్యాయని, దీంతో వందలాది గౌడ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల ద్వారా వెంటనే నష్ట అంచనా సర్వే నిర్వహించి తగిన పరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.అలాగే అగ్నిప్రమాదాలు సంభవించిన గ్రామాల్లో ఈత వనాల వద్ద ప్రత్యేకంగా వాటర్ బోర్లు మంజూరు చేసి నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ని ఎమ్మెల్యే కోరారు..ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..









